7వ సారి ట్రోఫి కైవసం చేసుకున్న ఆసీస్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏడోసారి ట్రోఫిని ముద్దాడింది. స్టార్ ఓపెనర్ అలీసా హీలీ ( 138 బంతుల్లో 170 ; 26 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. రాచెల్ హేన్స్ ( 68), బెత్ మూనీ ( 62) అర్ధశతకాలతో రాణించారు. మొదటి వికెట్ కు హేన్స్ తో కలిసి 160 పరుగులు జోడించిన హీలీ, రెండో వికెట్ కు మూనీతో 156 పరుగులు జత చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్ సోల్ మూడు వికెట్లు పడగొట్టింది.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. స్కీవర్ 9 121 బంతుల్లో 148 నాటౌట్ ; 15 ఫోర్లు, 1 సిక్సర్ ) చివరి వరకు పోరాడగా, మిగిలిన ప్లేయర్ల నుంచి ఆమెకు సహకారం లభించలేదు. ఆసీస్ బౌలర్లలో అలాన్ కింగ్, జెస్ జాన్సెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. మెగా టోర్నీ మొత్తంలో 509 పరుగులు చేసిన హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. గత వరల్డ్ కప్ తో పోలిస్తే నగదు బహుమతి రెండింతలు పెరుగగా, విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ. 10 కోట్లు, రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు రూ. 4.55 కోట్ల ఫ్రైజ్ మనీ లభించింది.