కోల్ కతాపై బెంగళూరు విక్టరీ

కోల్ కతాపై బెంగళూరు విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల ఖాతా తెరిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన స్వల్ప స్కోరింగ్ మ్యాచ్ లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 129 రన్స్ లక్ష్య ఛేదనలో ఆర్ సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది. టిమ్ సౌథీ (3/20), ఉమేష్ యాదవ్ (2/16) ధాటికి 17 పరుగులకే మూడు కీలక వికెట్లు డుప్లెసిస్ (5), అనూజ్ రావత్ (0), కోహ్లీ(12) కోల్పోయింది. ఈ దశలో రూథర్ ఫోర్డ్ ( 28), షాబాజ్ అహ్మద్ (27), డేవిడ్ విల్లే (18) బ్యాట్ ఝులిపించారు. ముఖ్యంగా రూథర్ ఫోర్డ్, విల్లే మూడో వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్యం సమీపిస్తున్న టైంలో వికెట్లు చేజార్చుకున్న బెంగళూరును దినేష్ కార్తీక్ ( 14 నాటౌట్ ), హర్షల్ పటేల్ ( 10 నాటౌట్ ) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.కోల్ కతాపై బెంగళూరు విక్టరీఆఖరి ఓవర్లో విజయానికి 7 రన్స్ అవసరమైన సమయంలో రస్సెల్ ను లక్ష్యంగా చేసుకున్న కార్తీక్ వరుసగా బంతుల్లో సిక్స్ , ఫోర్ తో జట్టును గెలుపు సంబురాల్లో ముంచాడు. నరైన్ (1/12), వరుణ్ చక్రవర్తి(1/33) ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు హసరంగ డిసిల్వా (4/20) ధాటికి కోల్ కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. 4 వికెట్లతో కోల్ కతాను కట్టడి చేయడంలో కీలకమైన డిసిల్వాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

కోల్ కతాను ముప్పు తిప్పలు పెట్టిన హసరంగ స్పిన్ మ్యాజిక్…
బెంగళూరు స్పిన్నర్ వహిందు హసరంగ స్పిన్ మ్యాజిక్ తో కోల్ కతాను ముప్పుతిప్పలు పెట్టాడు. టాస్ చేజార్చుకుని బ్యాటింగ్ కు దిగిన కోల్ కతాకు ఏదీ కలిసిరాలేదు. చెన్నైతో మ్యాచ్ లో ఆకట్టుకున్న ఓపెనర్లు రహానే(9), వెంకటేశ్ అయ్యర్ (10) ఘోరంగా నిరాశపరిచారు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో షాట్ ఆడబోయిన అయ్యర్ అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. రహానే కూడా చాలా సేపు క్రీజులో తన సత్తా చాటుకోలేకపోయాడు. సిరాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రహానే, షాబాజ్ అహ్మద్ క్యాచ్ తో నిష్క్రమించాడు. దీంతో 32 రన్స్ కే కోల్ కతా ఓపెనర్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (13), నితీశ్ రానా (10), సునీల్ నరైన్ (12), బిల్లింగ్స్ (14), జాక్సన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. డిసిల్వా తన సుడులు తిరిగే స్పిన్ తో కోల్ కతా బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. ఈ ఆర్ సీబీ స్పిన్ ను సరిగ్గా అర్థం చేసుకుని కోల్ కతా బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. అయితే ఆఖర్లో రస్సెల్ (25), ఉమేశ్ యాదవ్ (18) బ్యాట్ ఝులిపించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. చివరి వికెట్ కు ఉమేష్ , వరుణ్ చక్రవర్తి ( 10 నాటౌట్ ) నెలకొల్పిన 27 పరుగుల భాగస్వామ్యం అత్యధికం కావడం విశేషం. హర్షల్ పటేల్ ( 2/11), సిరాజ్ (1/25) రాణించారు.

పూర్తి స్కోర్ ..
కోల్ కతా : 18.5 ఓవర్లలో 128 ఆలౌట్ ( రస్సెల్ 25, ఉమేశ్ యాదవ్ 18, డిసిల్వా 4/ 20, ఆకాశ్ దీప్ 3 / 45),
బెంగళూరు : 19.2 ఓవర్లలో 132/7 ( రూథర్ ఫోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27, సౌథీ 3/20, ఉమేశ్ యాదవ్ 2/16)