ఉచిత రేషన్ పంపిణీ మరో 6నెలలు పొడిగింపు 

ఉచిత రేషన్ పంపిణీ మరో 6నెలలు పొడిగింపు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీని మరో 6 నెలలు పొడిగించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020 మార్చిలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద తెల్లరేషన్ కార్డు, అంత్యోదయ అన్న యోజన కార్డు, ఆహార పథకం కార్డు కల్గిన ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం మార్చి నెలతో ముగియనుండగా తాజాగా ఈ యేడాది సెప్టెంబర్ వరకు మరో సారి కేంద్రం పొడిగించింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది.ఉచిత రేషన్ పంపిణీ మరో 6నెలలు పొడిగింపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ‘ భారతదేశ బలం దేశంలోని ప్రతీ పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేయడానికి, సెప్టెంబర్ 2022 వరకు మరో 6 నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటారు’ అని ప్రధాని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా, దేశంలోని పేదలెవరూ కూడా ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ది ఉచిత ఆహార పథకాన్ని ప్రధాని మోడీ మరోసారి 6 నెలలు పొడిగించారని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దీంతో రూ.3.4 లక్షల కోట్ల విలువైన 1,003 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఈ పథకం కింద ఫ్రీగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.