తెలంగాణలో ఉచిత రేషన్ బంద్

తెలంగాణలో ఉచిత రేషన్ బంద్

కేంద్రం పొడిగించినా మన దగ్గర అమలు చేస్తలే
రూపాయికి కిలో చొప్పున డీలర్లకు స్టాక్‌‌ పంపిన రాష్ట్ర సర్కారు
లబ్ధిదారులకు 1.43 లక్షల టన్నుల బియ్యం అందట్లే

వరంగల్ టైమ్స్,హైదరాబాద్‌ ‌: రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ బంద్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌‌ పథకాన్ని పొడిగించినా టీఆర్ఎస్ సర్కారు అమలు చేయడం లేదు. రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యం మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ప్రతీ లబ్ధిదారునికి 10 కిలోల ఉచిత రేషన్‌‌ అందకుండా నిలిచిపోయాయి. దీంతో 2.87 కోట్ల మంది లబ్ధిదారులపై ఎఫెక్ట్ పడింది. మరోవైపు ఆదిలాబాద్‌‌, ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేంద్రం ప్రకటించిన ఫోర్టిఫైడ్‌‌ బియ్యం పంపిణీని మాత్రం అమలు చేస్తున్నారు.తెలంగాణలో ఉచిత రేషన్ బంద్సెప్టెంబర్ దాకా కేంద్రం పొడిగించినా ..
కరోనా మొదలయ్యాక 2020 ఏప్రిల్‌‌ నుంచి ఉచిత రేషన్‌‌ పంపిణీ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతీ నెల 5 కిలోల చెప్పున ఇస్తున్నది. ఈ పథకాన్ని దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. ఆరు నెలల పాటు పథకాన్ని కొనసాగించాలని మార్చిలో మరోసారి నిర్ణయించింది. అదనపు కోటా రేషన్‌‌ను సెప్టెంబర్‌‌ వరకు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. మరోవైపు రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల చొప్పున ఇస్తూ వచ్చింది. కేంద్రం ఉచిత పథకం మొదలు పెట్టాక.. తన కోటా నుంచి ఒక కిలోను తగ్గించుకుని, కేంద్రం ఇచ్చే 5 కిలోలకు మరో 5 కిలోలు కలిపి ఉచితంగా ఇస్తూ వచ్చింది. ఏప్రిల్‌‌లో 10 కిలోల ఉచిత రేషన్‌‌ అందించింది. కానీ మే నెలలో అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా కిలో రూపాయి చొప్పున రేషన్‌‌ డీలర్లకు శనివారం రాత్రి స్టాక్‌‌ అలాట్‌‌మెంట్‌‌ చేసింది. దీంతో ఆదివారం నుంచే ఉచిత రేషన్‌‌ పంపిణీని పక్కన పెట్టి.. రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యం అమలు చేస్తున్నారు.

2.87 కోట్ల మందిపై ఎఫెక్ట్..
రాష్ట్రంలో 90.49 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.87 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్రం 55 లక్షల కార్డులకు సబ్సిడీ భరించి రేషన్ ఇస్తుంది. మిగతా 35 లక్షల వరకు కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీ భరించి బియ్యం పంపిణీ చేస్తుంది. ఇలా 2.87 కోట్ల మంది లబ్ధిదారులకు అదనంగా మరో 5 కేజీలు ఇస్తే, 1.43 లక్షల టన్నుల బియ్యం అదనంగా అవసరమవుతాయి. ఇప్పుడు ఇవి అందడం లేదు.