వనదేవతల సన్నిధిలో సీతక్క, శ్రీధర్ బాబు 

వనదేవతల సన్నిధిలో సీతక్క, శ్రీధర్ బాబు వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సందర్శించారు. మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించారు. వనదేవతల చెంతకు వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే సీతక్క మాస్కులు పంపిణీ చేసింది. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకోవాలని ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా కోరారు. తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్లాలని ఆమె భక్తులకు సూచించారు. ఇక కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలను దర్శించుకోవడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికార ప్రభుత్వాలు జాతీయ హోదా కల్పించాలని అమ్మవార్లను కోరినట్లు ఆయన తెలిపారు.

వనదేవతలను దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలతో పాటు మంథని జెడ్పీ ఫ్లోర్ లీడర్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి, సర్పంచ్ రేగా కల్యాణి తదితరులు ఉన్నారు.