ప్రజా క్షేత్రంలో మోడీ తీరును ఎండగడతాం : దాస్యం

ప్రజా క్షేత్రంలో మోడీ తీరును ఎండగడతాం : దాస్యం

ప్రజా క్షేత్రంలో మోడీ తీరును ఎండగడతాం : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కావాలని దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందని ఆయన ఆరోపించారు. హనుమకొండ రాంనగర్ లోని నిత్య బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ విప్ దాస్యం బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆయన విమర్శించారు. దేశ సంపదను దోచుకుంటున్న అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేయకుండా, మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను ఈడీతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెడితే దేశప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

బాలవికాస సంస్థలపై ఐటీ దాడులను దాస్యం తీవ్రంగా ఖండించారు. చివరకు ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలుగా, నిజమైన గ్రామ అభివృద్ధి అంటే ఎలా ఉండాలో గంగదేవిపల్లి లాంటి గ్రామాన్ని ప్రత్యక్షంగా చూపించిన బాలవికాస లాంటి స్వచ్ఛంధ సంస్థలను కూడా వదిలి పెట్టడం లేదని మండిపడ్డారు. క్రైస్తవ , ముస్లిం మైనారిటీ సంస్థలను అణచి వేయడమే నరేంద్ర మోడీ ఏకైక లక్ష్యంగా కనబడుతోందని ఎద్దేవా చేశారు. కేంద్రంపై పోరాడుతున్న ఇతర ప్రతిపక్ష పార్టీలపైన కూడా బీజేపీ కక్షపూరితంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని అన్నారు.

సీఎం కేసీఆర్ కి ప్రాజెక్ట్ లను నిర్మించడం, పేదరికాన్ని నిర్మూలించడం తెలిస్తే, మత విధ్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విడగొట్టడం, తమను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను పడగొట్టడం నరేంద్ర మోడికి తెలుసని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మోడీ పాలనా తీరుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ , లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.