ఎవరినీ వదిలిపెట్టం : సీఎం కేసీఆర్

ఎవరినీ వదిలిపెట్టం : సీఎం కేసీఆర్హైదరాబాద్ :  తెలంగాణలో గంజాయి,  వాడకంను నిర్మూలించేందుకు పోలీసు అధికారులు వినూత్న రీతిలో ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారులతో సమీక్ష’ జరిగింది. సామాజిక బాధ్యతతో ముందుకెళ్తేనే సమాజంలో డ్రగ్స్ ను పూర్తిస్తాయిలో నిర్మూలించడం సాధ్యమని అధికారులను సీఎం సూచించారు.

దీనికోసం వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో “కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్” ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రే హౌండ్స్ మాదిరిగానే డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా పని చేయాలని సీఎం కోరారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, ప్రమోషన్స్ తో పాటు ప్రోత్సాహకాలను అందించాలన్నారు. వీటికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు సీఎం. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా వదిలిపెట్టొద్దని, పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. డ్రగ్స్ కేసుల విషయంలో ఎవరి పైరవీలనైనా ఉపేక్షించొద్దని అధికారులకు సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చాడు.