రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే : సైబారాబాద్ పోలీసులు

రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే : సైబారాబాద్ పోలీసులుహైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు జారీ చేశారు. సైబరాబాద్ సీపీ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ హెచ్చరించారు. సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బార్ లు , పబ్ ల యజమాన్యంతో సైబారాబాద్ పోలీసులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో భాగంగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మైనర్లను అనుమతించవద్దని, కొవిడ్ నిబంధనలు పాటించాలని పబ్ లు , బార్ ల యాజమాన్యాలకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ సూచించారు. ఒమిక్రాన్ భయంతో పబ్ లు, బార్ ల యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని హెచ్చరించారు. ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

డిసెంబర్ 31 రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి తెలిపారు.

శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.