తుమ్మలకు మళ్లీ టైమొచ్చింది !!

తుమ్మలకు మళ్లీ టైమొచ్చింది !!

తుమ్మలకు మళ్లీ టైమొచ్చింది !!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో ఓటమితో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ లోకి పువ్వాడ అజయ్ రాకతో ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. పువ్వాడ అజయ్ కి ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో తుమ్మలకు ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ ఎంపీగా కానీ అవకాశం ఇస్తారేమోనన్న ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ కు తుమ్మల సన్నిహితుడు కావడంతో ఆయనకు మంచి పోస్ట్ దక్కుతుందని ఊహించినా అది జరగలేదు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు పాలేరు నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పిందే నడుస్తుండడంతో గులాబీ పార్టీకి తుమ్మల దూరం జరిగారన్న గుసగుసలు వినిపించాయి. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తుమ్మల విషయంలోనూ అదే జరిగింది.

ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. మరోవైపు పార్టీలో ఇన్నాళ్లూ కీలకంగా వ్యవహరించిన పొంగులేటి తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. తుమ్మల కూడా గులాబీగూటికి గుడ్ బై చెప్పవచ్చని ప్రచారం కూడా జరిగింది. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ కు వాస్తవం బోధపడినట్లుంది. తుమ్మలను కాపాడుకునే ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. తుమ్మలకు హఠాత్తుగా ప్రాధాన్యత పెరిగింది. సాక్షాత్తూ మంత్రి హరీశ్ రావు… తుమ్మల ఇంటికి భోజనానికి వచ్చారంటే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి హరీశ్ రావు తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తుమ్మల ఇంటికి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల ఇంటికి హరీశ్ రావుతో పాటు మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు వెళ్లారు. అందరూ కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలతో హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు అన్ని అంశాలపైనా సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. తుమ్మల కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ రావు కూడా ఓకే చెప్పినట్లు టాక్.

ఈ మీటింగ్ తో ఖమ్మం బీఆర్ఎస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, అంతేకాదు ఖమ్మం మీటింగ్ ను సక్సెస్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా హరీశ్ రావుతో తుమ్మల చెప్పినట్లు టాక్. అన్నింటికి మించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా తుమ్మల ఆయన పక్కనే కనిపించారు. సీఎం ప్రసంగంలోనూ ఒకటి, రెండుసార్లు తుమ్మల ప్రస్తావన వచ్చింది. దీంతో తుమ్మలకు ప్రాధాన్యత తగ్గలేదని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలతో తుమ్మల ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు గులాబీశ్రేణులు చెప్పుకుంటున్నారు.

పొంగులేటి పార్టీ నుంచి బయటకు పోతారన్న ప్రచారం జరుగుతుండగా… తుమ్మల కూడా అదే బాటలో వెళ్తారేమోనని ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ శ్రేణుల్లో గుబులు రేగింది. కానీ మంత్రి హరీశ్ రావు ఎంట్రీతో తుమ్మల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక తుమ్మల బీఆర్ఎస్ లో ఉంటారని, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇప్పట్నుంచి ఉంటుందని తేలిపోయింది. అంతేకాదు సీఎం కేసీఆర్ పక్కనే తుమ్మల కనిపించడంతో ఇంకాస్త క్లారిటీ వచ్చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రాధాన్యత మరింత పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.