16,17న ఆయుష్ సీట్లకు కౌన్సెలింగ్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి ఈ నెల 16 నుండి 17 వరకు రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు నేడు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి 17 సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.