రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టులు మృతి

రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టులు మృతిహైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హెచ్ సీయూ వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను కారు డ్రైవర్ విజయవాడకు చెందిన అబ్దుల్ రహీమ్ , మహబూబ్ నగర్ కు చెందిన ఎం.మానస, కర్ణాటకు చెందిన ఎన్. మానసగా గుర్తించారు. అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగి కాగా, మహిళలిద్దరూ జూనియర్ ఆర్టిస్టులు.

గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్ సాయి సైదులు అని, అతను కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అమీర్ పేటలోని హాస్టల్ ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.