అన్నదాతలపై బీజేపీ మరోసారి కన్నెర్ర

అన్నదాతలపై బీజేపీ మరోసారి కన్నెర్రఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది. రైతులపై మరోసారి జలఫిరంగులు ప్రయోగించింది. అయినప్పటికీ రైతులు
బెదరకుండా అంతకంతకూ పెరుగుతుండడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లు నేరవేరేదాకా వెనక్కి తగ్గేదిలేదని, బలప్రయోగంతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని స్పష్టంచేశారు. ఘాజీపూర్​, టిక్రీ , సింఘి ప్రాంతాల్లో నిరసన చేస్తున్న రైతులు ఢిల్లీలోకి చేరేందుకు యత్నించడంతో పోలీసులు జలఫిరంగుల్ని ప్రయోగించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కాంక్రీట్​ బారికేడ్లను ట్రాక్టర్లతో పక్కకు నెట్టి నగరంలోకి ప్రవేశించేందుకు రైతులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే మొహరించిన పోలీసు బలగాలు వారి ప్రయత్నాల్ని భగ్నం చేశాయి. రాజధాని నడిబొడ్డున ఆందోళన చేసేందుకు తమని అనుమతించాలని రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. స్పందించిన పోలీసులు ఇప్పటికే రైతులకు బురాడీ మైదానంలో శాంతియుతంగా నిరసన చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అక్కడే నిరసన చేసుకోవాలని స్పష్టంచేశారు. అయితే నూతన వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలను రైతుసంఘాలు నేడు రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం కేంద్రం మరోమారు రైతు సంఘాలతో చర్చలు జరుపనున్నట్లు సమాచారం.