హైదరాబాద్ : కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్ ఉన్న కుర్రాడని కిరణ్ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. టాలెంట్ ఉన్నోళ్లకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంది. అలాగే, కిరణ్ అబ్బవరానికి హీరోగా మరిన్ని అవకాశాలు ఇచ్చింది. ‘రాజావారు రాణిగారు’ విజయం తర్వాత అతను ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ చేస్తున్నారు. ఆల్రెడీ అందులో రెండు పాటలు ‘చూశారా కళ్లారా..’, ‘చుక్కల చున్నీ’ విడుదలయ్యాయి. శ్రోతలను ఆకట్టుకున్నాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ విడుదలకు ముందే కిరణ్ అబ్బవరం మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తుతున్న ‘సెబాస్టియన్ పిసి524’ సినిమా మదనపల్లిలోని సొసైటీ కాలనీ రామాలయం కల్యాణ మండపంలో బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, కళ: కిరణ్, కూర్పు: విప్లవ్ న్యసదాం, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.