ఆదిలాబాద్ లో ఆ ఇద్దరి మధ్యే టఫ్ ఫైట్!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : ఆదిలాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు గులాబీ అడ్డా. జోగు రామన్న ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించారు. తెలంగాణ సెంటిమెంటుతో ఆయన వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. కేసీఆర్ మొదటి కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు జోగు రామన్న. అలాంటి జోగు రామన్నకు ఈసారి గడ్డుకాలం తప్పదన్న గుసగుసలు ఆదిలాబాద్ లో వినిపిస్తున్నాయి.
*ఆదిలాబాద్ లో నో డెవలప్మెంట్
జోగు రామన్న ఇప్పటికే నాలుగుసార్లు గెలవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు విజయం సాధించడంతో ఆదిలాబాద్ జనంలో కొంత వ్యతిరేకత ఉందన్న వాదన ఉంది. ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పటికీ ఆదిలాబాద్ లో జోగు రామన్న ఏమీ చేయలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 2014కు ముందు ఆదిలాబాద్ కు, ఇప్పటి ఆదిలాబాద్ కు పెద్దగా తేడా లేదన్న మాట అయితే బలంగా వినిపిస్తోంది.*జోగు రామన్నపై వారికి ఎందుకు కోపం ?
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికీ చేరవేయడంలో గులాబీ శ్రేణులు వెనుకంజలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పోడు భూముల సమస్య నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన జనం జోగు రామన్నపై ఆగ్రహంగా ఉన్నారట. పోడుభూముల సమస్య పరిష్కారం దిశగా ఇంకా అడుగులు పడలేదు. దీనిపై ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవడంతో జోగు రామన్న కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారని తెలుస్తోంది. అంతేకాదు గులాబీశ్రేణులు కూడా జోగు రామన్నకు సహకరించడం లేదన్న వాదన కూడా ఉంది. పైరవీలు, దందాల పేరుతో క్యాడర్ ఎవరు వెళ్లినా జోగు రామన్న చేయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిచేయలేనని ముఖం మీదే ఆయన చెప్పేస్తున్నారట. దీంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు జోగుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
* వేగం పెంచిన బీజేపీ అభ్యర్థి
ఓవైపు ఆదిలాబాద్ లో గులాబీ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు బీజేపీ మాత్రం కొంతకాలంగా వేగం పెంచింది. కంది శ్రీనివాస్ రెడ్డి అనే యువ నాయకుడు ఆదిలాబాద్ బీజేపీలో దూసుకుపోతున్నారు. సొంతంగా ప్రజా సేవా కార్యక్రమాలను చేపడుతూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తాన్ని ఆయన చుట్టి వచ్చేశారని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పాయల్ శంకర్ కూడా, కంది శ్రీనివాస్ రెడ్డి ధాటికి తట్టుకోలేక సైలెంట్ అయ్యారని టాక్. బీజేపీ హైకమాండ్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డికి మంచి ప్రోత్సాహం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
*జోగు రామన్నపై దళిత బంధు ఎఫెక్ట్
ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీసీలు, ఆదివాసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీసారి ఈ రెండు వర్గాలు జోగు రామన్న వెంటే ఉంటున్నాయి. అయితే ఈసారి ఈ ఓట్లకు గండిపడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీసీలు కూడా జోగు రామన్నపై వ్యతిరేకతతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దళితబంధు స్థాయిలో బీసీలకు పెద్దగా చెప్పుకో తగ్గ పథకాలు లేకపోవడం, చెప్పుకో తగ్గ పరిశ్రమలేవీ ఆదిలాబాద్ లో లేకపోవడంతో ఆ వర్గం తీవ్ర నిరాశలో ఉంది. ముఖ్యంగా యువత ఉపాధి కోసం పక్కనున్న మహారాష్ట్రకో, లేక హైదరాబాద్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఉందట. అందుకే ఈసారి ఆయా వర్గాలు గులాబీ పార్టీకి షాక్ ఇవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది.
*ఈ సారి బీజేపీకి కలిసొచ్చేనా..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ తరపున జోగు రామన్న, బీజేపీ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేకతలు జోగురామన్న కొంప ముంచే ప్రమాదముందని ప్రచారం జరుగుతోంది. బీసీలు, ఆదివాసీలు కరుణిస్తే తప్ప ఆయనకు కష్టమేనని సమాచారం. ఇక బీజేపీకి మాత్రం కొంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే ఈసారి బీజేపీకి కలిసొచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
*ఎవరి అస్త్రం ఫలిస్తుందో..
అయితే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేం. ఏమైనా జరగొచ్చు. కేసీఆర్ కొత్త అస్త్రాలు తీస్తే జోగు రామన్నకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అమిత్ షా లాంటి వారు ఆదిలాబాద్ లో సభ పెడితే బీజేపీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదిలాబాద్ లో ఈసారి పోటీ రసవత్తరంగా జరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.