వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం

వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయంవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఇప్పటికే వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ 20 లోనూ అదే రిపీట్ చేసింది. 3 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన నామమాత్రపు టీ 20 లో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ ను 18 పరుగుల తేడాతో ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. 4 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25), ఇషాన్ కిషన్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ ( 4) కూడా ఔట్ అవ్వడంతో పరుగుల వేటలో జట్టు వెనుకపడిపోయింది.

అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 65 పరుగులతో టీంను ఆదుకున్నాడు. 7 సిక్సులతో చెలరేగి ఆడాడు. వెంకటేశ్ అయ్యర్ (35)తో కలిసి భారీ స్కోర్ అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్, 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ తర్వాత 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఓవర్ నుంచే తడబడింది. మయేర్స్ (6), షై హోప్ (8) స్వల్ప రన్స్ కే ఔటయ్యారు. అయితే నికోలస్ పూరన్ (61) చెలరేగి ఆడాడు. రోవ్ మన్ పావెల్ (25), రొమారియా షెఫర్డ్ (29) ఫర్వాలేదనిపించారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కీరన్ పోలార్డ్ (5), జేసన్ హోల్డర్ (2), రోస్టన్ ఛేజ్ (12), అలెన్ (5), డ్రెక్స్ (4) రన్స్ వేటలో విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నస్టానికి 167 రన్స్ వద్దనే ఆగిపోయింది. దీంతో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ కూడా భారత్ జట్టు ఖాతాలో చేరింది.