తెలంగాణ సెక్రటేరియెట్ అందాలు చూడతరమా!
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : విజనరీ సీఎం కేసీఆర్ నిర్మిస్తోన్న అత్యంత బ్యూటిఫుల్ సెక్రటేరియెట్ తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 30న సమీకృత కొత్త సచివాలయం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అద్భుతమైన గ్రీనరీ, వాటర్ ఫౌంటెన్లతో ఇక్కడి ల్యాండ్ స్కేప్ చూపరులకు కనువిందు చేయనుంది. ఎత్తైన ప్రహరీ, విశాలమైన పార్కింగ్ ప్లేస్, హెలిపాడ్లతో సహా అన్ని ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ ను నిర్మించారు. ఉద్యోగుల కోసం, సందర్శకుల కోసం క్యాంటీన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, ప్రత్యేకమైన పార్కింగ్ లాంటి సకల సౌకర్యాలను కూడా ఇక్కడ ఒక పద్దతి ప్రకారం కల్పించారు.
బిల్డింగు 6వ అంతస్తులో సీఎం, ఆయన సిబ్బంది కొలువుదీరనున్నారు. సీఎం ఛాంబర్ కు అనుసంధానంగా ఒక భారీ మీటింగ్ హాలును ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి, సంబంధిత సిబ్బంది ఛాంబర్లు కూడా ఇదే అంతస్తులో ఉండనున్నాయి. మొదటి అంతస్తును సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలకు కేటాయించారు. ఇక క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా విశాలమైన హాలు, ఒక బాంక్వెట్ హాలు, మరో పెద్ద ఆడిటోరియం, దేశవిదేశాల నుంచి ముఖ్య అతిథులు, ప్రతినిధులు వస్తే అక్కడే భేటీ అయ్యేలా ఏర్పాట్లు, ప్రతి అంతస్తులో మంత్రుల ఛాంబర్లకు అనుసంధానంగా సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథులు వస్తే సమావేశం అయ్యేలా తూర్పు వైపు పోర్టికో పై భాగంలోని మధ్య గుమ్మటంలో హుస్సేన్ సాగర్ లేక్ వ్యూతో ఏర్పాటు చేసిన మీటింగ్ హాలు కొత్త సచివాలయంకు హైలైట్ కానున్నట్లు సమాచారం.
ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జాతీయ పండుగల సందర్భంగా సౌధం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో వెలిగించడానికి జాతీయజెండా, ఇతర లైటింగులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వనగరం హైదరాబాద్ లో పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో న భూతో న భవిష్యత్ అన్న చందంగా తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పరిపాలనా సౌధం 3డీ యానిమేషన్ ఓ సారి చూద్దాం..