హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ గడువు ముగిసే వరకు పలువురు ఓటర్లు పోలింగ్ సెంటర్లలో బారులు తీరగా, వారికి ఓటు వేసుందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నది. సాయంత్రం 5 గంటల వరకే 76.26 శాతం పోలింగ్ నమోదైంది.
గతంలో 2018 ఎన్నికల్లో హుజురాబాద్ లో 84.5 శాతం పోలింగ్ నమోదవగా, ఈ ఉపఎన్నికల్లో 90 శాతానికి మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ పూర్తైన చోట ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సీజ్ చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య వాటిని వాహనాల్లో కరీంనగర్ లోని ఎస్సార్ ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలిస్తున్నారు.