నల్లగొండ, భువనగిరికి కొత్త ముఖాలు ఖాయం
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : నల్లగొండ ఎంపీగా పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అధిష్టానం ఆదేశాలతో నల్లగొండ ఎంపీగా నిలిచి, గెలిచారు. ఇక భువనగిరి ఎంపీ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయన… ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఇద్దరు అగ్రనేతలు మరోసారి ఎంపీలుగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరని టాక్.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించారు. ఇంకా పోషిస్తున్నారు. ఎంపీగా గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఎమ్మెల్యే కావాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఈసారి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఈ విషయాన్ని హైకమాండ్ కు కూడా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లోనే తాను ఉంటానని, జాతీయస్థాయి పాలిటిక్స్ తనకు అవసరం లేదని చెప్పినట్లు టాక్. అందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రస్తుతం అసమ్మతి గళం వినిపిస్తున్నప్పటికీ హైకమాండ్ తో టచ్ లోనే ఉన్నారు. ఆయన కూడా మరోసారి ఎంపీగా పోటీచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని టాక్. ఈ మేరకు హైకమాండ్ కూడా వెంకట్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన నాయకులు. అలాంటి నాయకులు మరోసారి ఎంపీలుగా పోటీ చేయడమే కరెక్ట్ అన్నది హైకమాండ్ ఆలోచన. కానీ ఉత్తమ్ కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తుండడంతో అధినాయకత్వం కూడా విధి లేని పరిస్థితులో వారి ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.
అటు ఉత్తమ్, ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లపై ఇతర పార్టీలు అప్పుడే కన్నేశాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. కానీ బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఈ సీట్లలో తమ పార్టీల నుంచి గట్టి అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నాయి.
నల్లగొండ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడిని బీఆర్ఎస్ నిలబెట్టవచ్చని టాక్. ఇక భువనగిరి నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడిని దింపవచ్చని సమాచారం. బీజేపీ కూడా ఈ రెండు సామాజికవర్గాల నాయకులకే అవకాశం ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయ. మొత్తానికి ఈ రెండు ఎంపీ స్థానాల నుంచి ఎవరు పోటీచేసినా కచ్చితంగా పాత అభ్యర్థులకైతే ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈసారి నల్లగొండ, భువనగిరి సీట్ల నుంచి కొత్త ముఖాలు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.