పింఛన్ల పెంపుపై ప్రభుత్వం గుడ్ న్యూస్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలను అమలు చేయడమే లక్ష్యంగా.. ఆసరా పింఛన్ల పెంపుతో పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది తెలంగాణ సర్కార్.ఈ క్రమంలోనే ముఖ్యంగా దివ్యాంగులకు నెలకు రూ.6,000 పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధులు, ఇతర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2,016 పింఛన్‌ను రూ.4,000కు, అలాగే దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న రూ.4,016 పింఛన్‌ను రూ.6,000కు పెంచే దిశగా ఆర్థిక శాఖతో కలిసి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, ఇతర వర్గాలకు ఇస్తున్న రూ.2,016 పింఛన్‌ను రూ.4,000కు, దివ్యాంగులకు అందుతున్న రూ.4,016 పింఛన్‌ను రూ.6,000కు పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
ఆర్థిక శాఖ ప్రణాళికల మేరకు ముందుగా దివ్యాంగులకు పెంపు అమలు చేసి, ఆ తర్వాత దశలవారీగా మిగిలిన వర్గాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్ మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయీస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 లక్షల మంది వివిధ వర్గాల ప్రజలు ఆసరా పింఛన్లను పొందుతున్నారని గుర్తు చేశారు. పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో చర్చించామని, త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
విద్యా రంగంలోనూ కీలక మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంధులు, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు పదో తరగతి వరకే పరిమితమైన బ్రెయిలీ లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు విస్తరించనున్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అంతేకాకుండా, దివ్యాంగ జంటల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకంతో పాటు అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.కొత్తగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలు అమలైతే రాష్ట్రంలోని లక్షలాది దివ్యాంగ కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా పెద్ద ఊరట లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.














