కుమ్మెర ఘటనలో నిందితులెవరైనా శిక్షించాలి:

కుమ్మెర ఘటనలో నిందితులెవరైనా శిక్షించాలి: కేటీఆర్

కుమ్మెర ఘటనలో నిందితులెవరైనా శిక్షించాలి:వరంగల్ టైమ్స్, నాగర్ కర్నూల్ జిల్లా: కుమ్మెరలో జరిగిన ఘటన అమానవీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే దాడికి పాల్పడటం దారుణమని అన్నారు. తెలంగాణ సమాజం తలదించుకునే దుర్మార్గమైన ఘటనగా కేటీఆర్ అభివర్ణించారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ లోని అంబేద్కర్ కూడలిలో కుమ్మెర గ్రామస్థులు చేపట్టిన ధర్నాకు కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలోనూ కులం పేరిట దాడులు జరుగడం దారుణమన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య అని, వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాగర్ కర్నూల్ పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు అని అన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేస్తే అది సరిగ్గా లేదని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు కౌంటర్ కంప్లైంట్ చేయండని చెప్పడం సిగ్గుచేటన్నారు.పోలీసులు వేసుకున్న యూనిఫాంకి గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ నేతలను కాపాడడానికి ప్రయత్నిస్తుండటం ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు. బిడ్డకు పాలు ఇవ్వాల్సిన తల్లి ఖననం చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ న్యాయం కోసం రోడ్డు మీద కూర్చుంది. నాగర్ కర్నూల్ అధికార యంత్రాంగం ఈరోజు ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.