మల్లు స్వరాజ్యంకు ఎమ్మెల్సీ కవిత నివాళులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కామ్రేడ్ మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం ధీరత్వాన్ని, స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమె వ్యక్తిత్వాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మా లాంటి ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా మల్లు స్వరాజ్యం కీర్తి గడించారని తెలిపారు. మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ. 10 వేల రివార్డు ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.