పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా: తెలంగాణలొ పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు రైతుల ఆదాయాన్నిపెంచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆయిల్ పామ్ గెలలు రికార్డు ధరకు పలికినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.21,546 గా నమోదైందని తెలిపారు. ధరల పెరుగుదలతో రైతులకు భారీగా ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం 15,024 మంది రైతులకు రూ.2 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని చెప్పారు. రాబోయే యేళ్లలో టన్ను పామాయిల్ ధరను రూ.25000లకు పెంచే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వరికి బదులుగా అధిక లాభాలొచ్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్ గా మారుస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం ఉదయం రైతులకు పామాయిల్ సాగుపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జంగా రాఘవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పామాయిల్ రైతులకు మేలు కల్గించే శుభవార్త చెప్పడం తుమ్మల చిత్తశుద్దికి నిదర్శనమని ఆయన అన్నారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పాం సాగును మరింత విస్తరించాలని జంగా రాఘవరెడ్డి రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆయిల్ ఫెడ్ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తాయని హామీ ఇచ్చారు. రైతులు సాంప్రదాయ పంటలను వీడి అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగు వైపు మళ్లాలని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రైతన్నలకు పిలుపునిచ్చారు.

ఆయిల్ పాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శుభవార్తల నేపథ్యంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి రైతు సోదరులకు క్రింది అంశాలను వివరించారు.
-క్రూడ్ పామ్ ఆయిల్ (CPO)అంతర్జాతీయ ధరల పెరుగుదలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, 2026 ఫిబ్రవరి నెలకు గాను ఆయిల్ పాం గెలల ధర టన్నుకు రూ.21,546/-గా నిర్ణయించబడింది.
-గత జనవరి నెల ధర రూ.12,534/-తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. ఇది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక లాభం.

-ప్రస్తుత ధరల ప్రకారం ఒక్క టన్నుకు సుమారు రూ.1,090/- అదనపు లాభం రైతులకు అందుతుంది.
-రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు విస్తరించింది.
-1992 నుండి ఇప్పటివరకు 2.90 లక్షల ఎకరాలకు పైగా విస్తరణ జరగడం గర్వకారణం.
-15,024 మంది రైతులు 68,600 ఎకరాల్లో సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
-రాష్ట్ర సగటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు (OER)20.01%గా ఉండటం, రైతుల ఉత్పాదకత మెరుగుదలని సూచిస్తోంది.

-దేశంలో ఉత్పత్తి అయ్యే పామాయిల్‌లో 98% వాటా తెలంగాణ రాష్ట్రానిదే కావడం మన రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనం.
-పంట పూర్తిస్థాయిలో దిగుబడికి వచ్చిన 25-30 సంవత్సరాల వ్యవధిలో ఎకరానికి సుమారు రూ.1,50,000/- వరకు వార్షిక ఆదాయం పొందే అవకాశం ఉంది.
-ఆయిల్ పాం సాగులో మార్కెటింగ్ భారం రైతులపై లేకుండా, కోత నుండి మిల్లుకు రవాణా వరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆయిల్ ఫెడ్ సమన్వయం చేస్తోంది.
-ప్రజా ప్రభుత్వం “రైతే రాజు”అన్న నినాదాన్ని కార్యరూపం దాల్చిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది.
-వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆయిల్ పాం సాగు విస్తరణ, ధర స్థిరీకరణ, రైతుల ఆదాయ వృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
-రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రైతుల ఆర్థిక స్థిరత్వానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతున్నాయి.
-ఆయిల్ పాం సాగు ద్వారా రైతు కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయం, భరోసా,అభివృద్ధి సాధ్యమవుతోంది.