శివ శంకర్ మాస్టర్ ఇక లేరు

శివ శంకర్ మాస్టర్ ఇక లేరుహైదరాబాద్ : జనరంజకమైన నృత్యభంగిమల రూపకర్తగా దక్షిణాది చిత్రసీమపై తనదైన ముద్రను వేసిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో 3 రోజులుగా వెంటిలేటర్ పై ఉంచారు. ఆదివారం ఆయనకు కరోనా నెగెటివ్ అని వైద్యులు నిర్ధారించారు.

అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శివశంకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ మరణంతో అటు నృత్య కళారంగానికే కాకుండా యావత్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన లేని లోటును గుర్తు చేసుకున్నారు. శివశంకర్ మాస్టర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ ఆయన తల్లిదండ్రులు. తండ్రి కల్యాణ సుందర్ కు కర్ణాటక సంగీతం, జ్యోతిషంలో మంచి ప్రావీణ్యం ఉండటంతో శివశంకర్ కు చిన్నతనంలోనే నృత్యంపై మక్కువ ఏర్పడింది. రెండేళ్ల వయసులో ఓ ప్రమాదం కారణంగా శివశంకర్ వెన్నెముకకు గాయమైంది. కోలుకోవడానికి 8 యేళ్లు పట్టింది. దీంతో ఇంటి దగ్గరే ప్రాథమిక విద్యనభ్యసించారు. చెన్నైలోని నటరాజశకుంతల అనే డ్యాన్స్ మాస్టర్ వద్ద నృత్యం నేర్చుకున్నారు. సహాయ నృత్య దర్శకుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి నాటి ప్రముఖ కొరియోగ్రాఫర్ సలీం దగ్గర శిష్యరికం చేశారు. తమిళ చిత్రం ‘కురివికూడు’ ద్వారా 1980లో నృత్య దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించారు.

నృత్యదర్శకుడిగానే కాకుండా నటుడిగా రాణించిన శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలను పోషించారు. దక్షిణాదితో పాటు హిందీ, ఒరియా, మరాఠీ, తుళు, బెంగాలీ, జపనీస్ తో పాటు 10 భాషల్లో నృత్య దర్శకుడిగా పనిచేశారు. శివశంకర్ కు భార్య సుగణ్యతో పాటు కొడుకులు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్ ఉన్నారు. కొడుకులిద్దరూ తండ్రి బాటలోనే నృత్య దర్శకత్వం వైపు అడుగులు వేశారు.