యాష్ ట్యాంకర్ బీభత్సం..ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా : నూతన సంవత్సరం మొదటి రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యాష్ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఇండ్ల మధ్యనున్న దారిలో వెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా అదుపుతప్పి అడ్డొచ్చిన వాళ్లపై నుంచి దూసుకెళ్లి చివరకు ఓ ఇంటిగోడను ఢీకొట్టి ఆగింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ లారీ బీభత్సంలో పార్కుచేసి ఉన్న ఓ ఆటో కూడా ధ్వంసమైంది.