ఆ ఘటనతో వరంగల్, ఖమ్మంలో విషాదం
వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన వారంతా దాదాపు 25 యేళ్ల వయస్సులోపు వారే. అయితే ఆరుగురు మృతుల్లో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు కాగా, ఒకరు ఖమ్మం జిల్లా వాసి. వీరంతా అదే కాంప్లెక్స్ లోని ఓ ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నారు.
మృతుల వివరాలకొస్తే వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మహబూబాబాద్ మండలం సురేష్ నగర్ కి చెందిన ప్రమీల ( 22 సం.), కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్ (23 సం.), వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఖానాపూర్ తండాకు చెందిన బి. శ్రావణి (22), నర్సంపేట మండలం మర్రిపెల్లికి చెందిన వెన్నెల (22), నర్సంపేటకు చెందిన వి. శివ (22), ఇక త్రివేణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. దీంతో వరంగల్, మహబూబాబాద్ , ఖమ్మం జిల్లాల్లో విషాధ ఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.