రైతుబంధు ఎంత ఇచ్చారు తెలుసా ?

రైతుబంధు ఎంత ఇచ్చారు తెలుసా ?హైదరాబాద్ : రైతు బంధు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఈ పథకం గొప్ప ఊతంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.

ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. 62.99 లక్షల మంది రైతులకు రూ.7,411 కోట్ల నగదు జమ చేశామని స్పష్టం చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రైతు బంధు పంపిణీ చేశఆరు. ఇక అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రైతు బంధు సాయం అందిందని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి పంటలకు మద్దతు ధరలను నిర్ణయించాలన్నారు. కేంద్రం పంటలన్నింటినీ మద్దతు ధరకు కొనాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.