కూలిన హెలికాప్టర్ చీతా..ముగ్గురు దుర్మరణం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌లో భారత వైమానిక దళం హెలికాప్టర్ చీతా కూలిపోయిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి వీవీబీ రెడ్డి (ఉప్పల వినయ భానురెడ్డి) సహా ఇద్దరు పైలట్లు మృతిచెందారు. సెంగె నుంచి మిస్సమరి మార్గంలో ఈ హెలికాప్టర్ గురువారం బొమ్డిల పట్టణానికి పశ్చిమాన మండాల అనే ప్రాంతంలో కూలింది. నిన్న ఉదయం 9.15 గంటలకు ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ భానురెడ్డి (37) దుర్మరణం చెందారు. మరో మేజర్ జయంత్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
వినయ భాను రెడ్డికి భార్య స్పందనారెడ్డి, కుమార్తెలు అనికరెడ్డి(6), హర్వికరెడ్డి(4) ఉన్నారు. స్పందనారెడ్డి కూడా పుణెలో ఆర్మీలో దంత వైద్యురాలుగా పనిచేస్తున్నారు. వారి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం. భాను రెడ్డి తండ్రి నర్సింహ్మారెడ్డి గత 40 యేళ్లుగా మల్కాజిగిరిలోని దుర్గానగర్‌లో నివాసముంటున్నారు. 2007లో ఆర్మీలో ఉద్యోగం సాధించిన వీవీబీ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్ కల్నల్ స్థాయికి చేరారు. ప్రస్తుతం ఆయన పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో నేడు శుక్రవారం వీవీబీరెడ్డి మృతదేహం నగరానికి రానుంది.