కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తగవు: హరీష్ రావు

వరంగల్ టైమ్స్, సిద్ధిపేట జిల్లా : రాజ్యాంగంలో కొంత మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ మాట్లాడితే కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో 25 కోట్ల మంది దళిత జనాభా ఉంటే కేవలం 8 కోట్ల బడ్జెట్ పెట్టడం సరికాదంటూ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్ధిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో 164 సామూహిక గృహ ప్రవేశాలకు హాజరైన మంత్రి హరీష్ రావు లబ్ధిదారులను గృహ ప్రవేశాలు చేయించారు. అంతకు ముందు చింతమడక గ్రామంలో దమ్మ చెరువు నుంచి నర్లేంగడ్డ వరకు బీటీ రోడ్డు, అలాగే చింతమడక నుంచి రాఘవాపూర్ వయా సింగ చెరువు వరకు బీటీ రోడ్డు, చింతమడక నుంచి చెల్లాపూర్ – రాజక్కపేట వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తగవు: హరీష్ రావుఅనంతరం నూతన గృహ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మంత్రి దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి ప్రయివేటు కంపెనీలకు ఇస్తే..రిజర్వేషన్లు ఏలా వర్తిస్తాయని.. అలా అమ్మితే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ వస్తుందా..అంటూ రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు హక్కులు సంక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన హక్కులు దక్కాలని సీఎం కేసీఆర్ చెప్పారని, అదానీ, అంబానీల సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా..? అందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దీన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తూ, అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని బీజేపీ తీరుపై మండిపడ్డారు.కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తగవు: హరీష్ రావుబడ్జెట్లో ఎఫ్ఆర్బీఏం పరిమితి తగ్గించడంతో తెలంగాణకు 5 వేల కోట్ల కోత పడినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. దేశంలోనీ ఆర్మీ, నేవీ, సెంట్రల్ ఫోర్స్, రైల్వే, బ్యాంకింగ్ రంగ వివిధ సంస్థల్లో 15లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయం పై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కేవలం 7.5 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చెప్పకనే తమ తప్పులు ఒప్పుకున్నారని, వెంటనే ఆ ఖాళీలు భర్తీ చేయించాలని బండికి మంత్రి సవాల్ విసిరి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు, త్వరలోనే మిగతావి కూడా చేస్తామని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్ష గట్టింది. సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టి, యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించాలని మంత్రి హరీష్ రావు కోరారు.