చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు అమలు చేయండి

చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు అమలు చేయండివరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పేదలకు మరింత న్యాయం జరిగేందుకే రాజ్యాంగంలో మార్పులు చేసి, ఇంకా పటిష్టం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం దళితబంధు కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన రూ.4 కోట్ల 81 లక్షల 49 వేల విలువైన వాహనాలను లబ్ధిదారులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని 51 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు వీటిని అందించారు. పంపిణీలో భాగంగా 10 హార్వెస్టర్లు, రెండు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, ఒక ఆటో ట్రాలీ, రెండు బొలోరో వాహనాలు, ఒక జెసిబి, 16 ట్రాక్టర్లు& రోటా వేటర్లు, 2 ట్రాక్టర్లు & ట్రాలీలను లబ్ధిదారులకు పంపిణి చేశారు.

చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు అమలు చేయండి ఈ పంపిణీ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, శ్రీధర్ బాబు, జెడ్పి చైర్మన్లు గండ్ర జ్యోతి, సుదీర్ కుమార్, రాష్ట్ర షెడ్యూల కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, గోపి, శివలింగయ్య, శశాంక, రూపేష్ మిశ్రా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

దళితులంతా ఏకమై దళితుల గురించి తప్పుడు ప్రచారం చేసే వారికి బుద్ధి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. అంబేద్కర్ ను విమర్శించాడని తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఒకసారి ఆలోచన చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ పాలిస్తున్న ఆయా రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. నేటి డ్రైవర్ లు, క్లీనర్లను దళితబందు పథకం ద్వారా ఓనర్లను చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రూ.1737 కోట్లతో దళితబంధు పంపిణీ చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కమలాపూర్ లో 3893 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు.