ఉద్యోగులకు మంత్రి బొత్స హెచ్చరికలు

ఉద్యోగులకు మంత్రి బొత్స హెచ్చరికలుఅమరావతి : ఉద్యోగులు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని చెబుతున్న ఉద్యోగుల తీరును మంత్రి బొత్స ఖండించారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు సీఎం పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు చూడాల్సి వస్తుందని మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు.

మొదటి తేదీ నుంచి ఎంత మందికి వీలైతే అంతమందికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాత జీతాలు కావాలంటారు. మొదటి తేదీన జీతాలు వేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా అంటూ ఉద్యోగులను మంత్రి ప్రశ్నించారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, అధికారులపై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇవన్నీ క్రమశిక్షణా చర్యల్లో భాగమేనన్నారు. టీడీపీకి టైం బాలేదని ఎద్దేవా చేశారు. దీక్షలు వాళ్లే చేస్తున్నారు. వాళ్ల నాయకులే అత్యాచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.