కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు

కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదుహైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు అఖిలపక్షం నాయకులు నిరసనలకు దిగారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల పాటు హనుమకొండ జిల్లాలో వివిధ రూపాల్లో నిరసనలు తెల్పిన అఖిలపక్షం నాయకులు నేడు రాష్ట్ర రాజధానిలో నిరసన గళం విప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పీఓహెచ్ కు నిధులు మంజూరు చేయాలంటూ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు సికింద్రాబాద్ లోని రైల్ నిలయాన్ని ముట్టడించారు.

కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు

సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట మహాధర్నాకు దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, టీటీడీపీ, ఇతర పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మహాధర్నాలో భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు అఖిల పక్షం నాయకుల నిరసనను చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులకు, అఖిలపక్షం నాయకులకు మధ్య తోపులాటలు జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ మహాధర్నాలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రైల్వే ఇంచార్జి జీఎంకు వినతిపత్రాన్ని అందచేశారు.

కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదుకాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ హామీలను కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాజిపేట్ – హుజురాబాద్ – కరీంనగర్ రైల్వే లైన్ పనులు సత్వరమే పూర్తి చేసి, రానున్న రోజుల్లో రైల్వే లైన్ పనులు, భూ సేకరణ వంటి అన్ని రకాల పనులను రైల్వే శాఖ నిధుల నుంచే వెచ్చించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సిబ్బందితో రైల్వే లైన్స్ వేయడం వంటి అనేక కష్టతరమైన పనులు చేయించుకుని, అవి పూర్తైన తర్వాత ప్రస్తుతం సుఖమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పుడు ఈ వర్గాలకు చెందిన ఉద్యోగుల అవసరం లేదని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తుండటం శోచనీయమని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజిపేట్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బీజేపీ నాయకులను వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదవ రెడ్డి, సుందర్ రాజ్, వరంగల్ నగర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి, సీపీఐ నాయకులు మేకల రవి, తిరుపతి, భిక్షపతి, సీపీఎం నాయకులు చుక్కయ్య, సీపీఐఎంఎల్ నాయకులు గోవర్ధన్, అప్పారావు, టీఎమ్మార్పీఎస్ నాయకులు భిక్షపతి, ఎమ్మార్పీఎస్ నాయకులు రవి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.