కోచ్ ఫ్యాక్టరీ సాధించేదాకా సమరమే

హనుమకొండ జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ. 400 కోట్లు కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన శనివారం కాజీపేటలో అఖిలపక్షం నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ ధర్నాతో హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై సుమారు 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సీఐ మహెందర్ రెడ్డి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు.

కోచ్ ఫ్యాక్టరీ సాధించేదాకా సమరమేakzipetఅనంతరం అఖిల పక్షం నాయకులు నిరసన గళం విప్పారు. కాజీపేట రైల్వే జంక్షన్ కు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 159.7 ఎకరాల భూమిని దాదాపు యేడాదిక్రితం రైల్వే శాఖకు అప్పగించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

దీనికోసం తెలంగాణ బీజేపీ నాయకులు పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి , నిరుద్యోగ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని చీఫ్ విప్ స్పష్టం చేశారు. 5 రోజుల పాటు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో శాంతియుతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించినట్లు దాస్యం వివరించారు. సోమవారం సికింద్రాబాద్ లో రైల్వే కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, సీపీఎం నాయకుడు చుక్కయ్య , సీపీఐ నాయకులు ఉప్పలయ్య, న్యూడెమోక్రసీ నాయకులు అప్పారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు బాబాఖాదర్ , ఎమ్మార్సీఎస్ నాయకులు పుట్ట రవి, రైల్వే మాజీ కార్మిక నాయకుడు యాదవరెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎలకంటి రాములు, సంకు నర్సింగరావు, జక్కుల రవిందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ, టీఆర్ఎస్ నాయకులు అజీజ్ ఖాన్ , మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.