ఈనెల 11న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈనెల 11న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుతిరుమల : జనవరి 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వరకు తిరుమల పరిధిలోని వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13 నుంచి 22 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లెటర్లను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 32,613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక టీటీడీకి నిన్న రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు కరోనా రూల్స్ తప్పకుండా పాటించాలని కోరారు. కరోనా కట్టడికి టీటీడీ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటుందని, భక్తులు సహకరించి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.