రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీలు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీలు దుర్మరణం

వరంగల్ టైమ్స్, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం ఆ కారు నాగార్జున సాగర్ లోకి దూసుకెళ్లింది. కారు ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతులను హైదరాబాద్ కు చెందిన కుటుంబరావు, ఆయన భార్య మార్తమ్మ, శాంతి, ఇందిర, 6 నెలల పాప ప్రిన్సీగా గుర్తించారు. కుటుంబరావు కుమారుడు జోషి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మనుమరాలు ప్రిన్సీ అన్న ప్రాసనం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను హైదరాబాద్ లోని చందానగర్ హుడా కాలనీ వాసులుగా గుర్తించారు.