హృదయవిదారకం..165 మంది బాలికల సమాధులు ఒకే చోట
-కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడులు
-ఇరాన్ మినాబ్‌లోని ఓ స్కూల్లో 180 మంది విద్యార్థులు మృతి
-అందులో 165 మంది బాలికలే
-ఇప్పటి వరకు 1000 మందికి పైగా మృతి
-మృతుల్లో ముగ్గురు భారత నావికులు
వరంగల్ టైమ్స్,ఇరాన్: అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ లో మృతిచెందిన వారి సంఖ్య 787 కు చేరినట్లు ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెల్లడించింది. శనివారం ప్రారంభమైన దాడులు ఇంకా తీవ్రతరమవుతున్నాయి. యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ మినాబ్‌లోని ఓ స్కూల్లో 180 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. (IRGC)ఐఆర్జీఎస్ సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్భీ తమ దేశంలోని పరిప్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, హాస్పిటళ్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధ నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ చేసిన దాడుల్లో మరణించిన బాలికల మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని తెలిపారు. చిన్నారులను దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాజా నుంచి మినాబ్ వరకు అమాయకుల రక్తాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్లజూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలపై అమెరికా అధ్యక్షుడు చేసిన దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రైయిస్, ఇరాక్, జోర్డాన్, సైప్రస్ లపై విరుచుకుపడుతోంది. గల్ఫ్ లో పెద్ద నగరాలు అబుదాబి, దుబాయ్, దోహా, షార్జాలపై ఇరాన్ దాడి చేస్తోంది. ఇప్పటికే దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. టాప్ ఇరాన్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సభ్యులు మృతి చెందినట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు భారత నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఒమన్ తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.














