దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

టీఆర్​ఎస్​పై ఎంపీ అరవింద్​ ఫైర్​

దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంవరంగల్​ అర్బన్​ జిల్లా : టీఆర్ఎస్ ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని, హమాలీల నుంచి సీఎం వరకు రైతులను మోసం చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా నక్కలగుట్టలోని హరిత కాకతీయలో బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేస్తున్న వారికి అరవింద్ కౌంటర్ ఇచ్చాడు. నూతన వ్యవసాయ చట్టాలు భవిష్యత్ లో రైతులకు సుదర్శన కంకణం లాంటివని ఆయన తెలిపారు. గతంలో హమాలీలు, దళారీల వ్యవస్థ నశించాలని యూపీఎ ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిన కాంగ్రెసోళ్లు కూడా మోదీ రైతు చట్టాలను వ్యతిరేకించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇక పంట చనిపోతే రైతు భీమా ఇవ్వలేని కేసీఆర్, రైతు చనిపోతే మాత్రం రైతు భీమా ఇవ్వడం ఎంత వరకు సరైందో రైతులే తెలుసుకోవాలని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలపై పోరాటం చేసేవారంతా రైతులే కారని అన్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే చట్టంలో కాస్తో కూస్తో మార్పులు చేసే అవకాశం వుంటుందని మీడియా ముఖంగా తెలిపారు. దిమాక్ లేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నాడో ఏమోనని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఏవైనా బీజేపీ గద్దెనెక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు, కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఎంపీ అరవింద్ జోష్యం చెప్పారు.