పెండింగ్​ నిధులు విడుదల చేయాలి

పెండింగ్​ నిధులు విడుదల చేయాలిహైదరాబాద్​ : ఉపాధి క‌ల్ప‌న‌లో దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డుల‌తోపాటు, రావాల్సిన పెండింగ్ నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు కేంద్ర‌ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది‌ శాఖల‌ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ రూపొందించిన అనేక ప‌థ‌కాల‌తోపాటు 32 జిల్లాల్లో, 540 మండ‌లాల్లోని 12,770 గ్రామాల్లో మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థకాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ ఏడాది ఉపాధి ప‌ని దినాల ల‌క్ష్యం 13.75 కోట్లు కాగా, 13.37 కోట్ల ప‌నిదినాల‌ను నిర్ణీత స‌మ‌యానికి చాలా ముందే సాధించామ‌న్నారు. అంటే 97.37శాతం ల‌క్ష్య సాధ‌న‌తో దేశంలోనే రాష్ట్రం మొద‌టి స్థానంలో నిలిచింద‌న్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింద‌ని లేఖలో గుర్తు చేశారు.క‌రోనా స‌మ‌యంలోనూ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల‌కు తిరిగి వెళ్లిన ల‌క్ష‌లాది మంది వ్య‌వ‌సాయ కూలీల‌కు కూడా ఉపాధి క‌ల్పించిన‌ట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రావాల్సిన వాటా 1719.25 కోట్ల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 694.66 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశారని అన్నారు. ఇంకా రావాల్సిన 1024.59 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్ప‌టికే ప‌నులు పూర్తిచేసి బిల్లులు రాక కూలీలు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. చేసిన ప‌నులతో దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తూ అవార్డులు పొందుతున్న రాష్ట్రానికి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో మంత్రి ఎర్ర‌బెల్లి కోరారు.