బోల్తాపడిన చేపల లారీ.. నలుగురు కూలీలు మృతి

అమరావతి : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడేపల్లి గూడెంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. నారాయణపురం నుంచి చేపల లోడుతో లారీ దువ్వాడ వెళ్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తాడేపల్లిగూడెం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

లారీ కిందపడి నలుగురు కూలీలు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.