శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతివరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ప్రాతఃకాలాన స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన మనుమరాలు సుష్మ వివాహానికి హాజరుకావడానికి తిరుమల వచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. పుష్పగిరి మఠంలో సాదాసీదాగా తన మనుమరాలి వివాహం జరుగనుందని పేర్కొన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం కలుగుతుంటుందన్నారు.

ప్రముఖులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. అలా చేయడం వల్ల అందరికీ దర్శనభాగ్యం సులభంగా లభించే అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లు భేష్ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.