ఐనవోలు మల్లన్న చరిత్ర

ఐనవోలు మల్లన్న చరిత్రహనుమకొండ జిల్లా : తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి వేదిక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలమందు జానపదుల జాతరగా పిలిచేవారు. దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు కావడమే. తెలంగాణ రాష్ట్రంలో ఈ విగ్రహంను పోలిన దేవాలయాలు ఐదు కలవు. నాలుగు దేవాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా , ఒకటి మాత్రమే కరీంనగర్ జిల్లాలో కలదు. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు.

ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనముల ద్వారా తెలియుచున్నది. 1100 యేళ్ల చరిత్ర కల్గిన పురాతన శైవక్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. ఇది కాల క్రమేనా ఐనవోలు, ఐలోనిగా రూపాంతరము చెందినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో , శిల్పకళా వైభవంతో , అష్టోత్తర స్తంభములతో, కాకతీయుల కళాతోరణములతో , సింహద్వారములతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం, ఆపదలను తీర్చే మల్లికార్జునుడు.

ఐనవోలు మల్లన్న చరిత్ర

పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జునస్వామి కొలువుదీరిన ప్రాంతమే ఐనవోలు. కోరమీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసురుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్నకు కుడివైపున గొల్ల కేతమ్మ, ఎడమవైపున బలిజ మేడలమ్మ అమ్మవార్లు కొలువుదీరి ఉంటారు.. గొల్ల కేతమ్మ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. తన ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నదున మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.

ఇక రెండో భార్య బలిజమేడలమ్మ కర్ణాటక ప్రాంతవాసి. కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ఖండేలు రాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. కనుక మల్లన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బలిజ మేడలమ్మను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విగ్రహాల ఎదురుగా నిర్వికార నిరహంకార స్థితి లింగస్వరూపంలో మూలవిరాట్ మల్లికార్జునస్వామి ఉండటము. ఇట్టి లింగస్వరూపం అర్ధప్రానపట్టం కల్గి ఉండటం విశేషం. ఇలాంటి లింగాలు ఉండటం అరుదు. ఈ లింగం శ్వేత వర్ణం కలిగి ఉందని, ఎంతో ప్రాచీనమైనదని శైవాగమ పండితుల అభిప్రాయం.

రాష్ట్ర కూటులు, కళ్యాని చాళుక్యులు, కాకతీయులు, ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు, శిలా శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. శివభక్తులకు మహా పుణ్యక్షేత్రం ఐనవోలు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండటం ఈ ఆలయ విశిష్టత. ఒగ్గు కథలతో , శివసత్తుల పూనకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో సందడిగా మారి, ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన ఐలోని మల్లన్న జాతరలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎడ్ల బండ్లల్లో, వాహనాల్లో, కాలినడకన, సవారీ జంతువులపైన కూడా భక్తులు రెండ్రోజుల ముందుగానే ఐలోని క్షేత్రాన్ని చేరుకుని విడిది చేస్తారు. బోనం, పట్నాలు, బండారి సమర్పించి మల్లన్నను తరిస్తారు.

ఐనవోలు మల్లన్న చరిత్ర

ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపుని భక్తులు కానుకగా చెల్లిస్తారు. అదే పసుపును ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి చేతిలో ఉన్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్సవ సమయాల్లో కిలోల కొద్ది పసుపు ఉపయోగిస్తారు. మల్లన్న స్వామి భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజలలో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం, ఒగ్గు పూజారీల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులలో చాలామంది సంతానము గురించి టెంకాయ బంధనం కట్టి వారికి సంతానం కల్గిన తర్వాత టెంకాయ ముడుపు విప్పి, మల్లన్న మొక్కు చెల్లిస్తారు.

ఇక గండాలు తీరితే గండదీపం పెడతాం, కోరికలు తీరితే కోడెలు కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, ఇంటిల్లిపాది చల్లగా ఉంటే శేవలు తీస్తాం, తలనీలాలు సమర్పిస్తాం అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఈ జాతరలో పెద్ద బోనం, చిన్న బోనం, నిలువ బొట్ల బోనం, చుక్కల బోనం అని భక్తులు తమ ఆనవాయితీ ప్రకారం బోనం చేసి స్వామివారికి నివేదిస్తారు. ఇక ఈ జాతరలో గొల్ల , కురుమలే ఒగ్గు పూజారులుగా తమ కథాగానం వినిపిస్తారు. పట్నాలు వేసి, ఒగ్గు పూజారిచే పూజలు చేపిస్తేనే అసలుసిసలైన బోనం సమర్పించినట్లుగా భక్తుల విశ్వాసం. అంతేకాదు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, ఢమరుకం మోతలతో ఈ జాతర మార్మోగుతుంది.

భోగి, సంక్రాంతి పర్వదినం ముందు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర వేడుకల్లో భోగి నుంచి కనుమ వరకు భక్తుల లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు రాత్రి ప్రభల బండ్లు తిరుగుట ఈ జాతరలో విశేషం. మార్నేని వంశస్తుల శిడినథాన్ని పునరుద్దరించి దేవుడి పెద్దరథంగా మార్చి ఉత్సవాలలో ప్రదక్షినం చేయిస్తున్నారు. దీనితో పాటు కుక్కల కొట్లాట, చల్లకుండల నెత్తుట, తలబండారి పెట్టుకొని మొక్కులు చెల్లించుతారు. భక్తిభావంతో పాటు వినోదాత్మకంగా సాగుతుండే ఈ జాతర బహుప్రాశస్త్యమైంది.

కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణ స్థానిక మార్నేని వంశస్తులు, కురుమలు, శైవారాధకులు ( తమ్మలు) సంయుక్తంగా నిర్వహించేవారు. జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు కీర్తి మరింత విస్తరించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో అప్పటి వరకు హక్కుదారుగా కొనసాగిన మార్నేని వంశీయులు 1968 లో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. తొలి సారి చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన మార్నేని జగన్నాథరావు అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి శ్రీ మల్లికార్జున స్వామి ఘనవైభవం నలుదిశలా విస్తరించింది.

వరంగల్ మహానగరానికి సుమారు 16 కిలో మీటర్ల దూరంలో ఉండే ఐనవోలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అభివృద్ధికి నోచుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఐనవోలు మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా యేడాది పాటు భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వస్తూనే ఉంటారు. భక్తుల సౌకర్యార్థం అధునాతన గదులు, గెస్ట్ హౌజులు, నిర్మించారు. స్త్రీల స్నానాల గదులు, మరుగుదొడ్లు , నూతనంగా ధ్వజస్తంభం, నందికేశ్వర, విఘ్నేశ్వరులను ప్రతిష్టించారు. సాలహార నిర్మాణం జరిగింది. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తినుబండారాల దుకాణాలు ఇక్కడ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.