ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా:మంత్రి ఎర్రబెల్లి

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా:మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు హైదరాబాద్ ప్రజలకు అంకితమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు, పన్నాగాలు పన్నినా స్పష్టమయిన మెజారిటీ ని టీఆర్ఎస్ కు ఇచ్చి ప్రజలు తమ అభిమతాన్ని చాటారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఓటర్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సారథ్యం వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తిరుగులేని మహానాయకులని, తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి జీహెచ్ఎంసీ ఫలితాలతో గంగా జమున తహజీబ్ లా, అంతా కలిసే ఉంటామని ఉద్వేగాలను రెచ్చగొట్టిన విద్రోహులకు తేల్చిచెప్పారని, తెలంగాణలో ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు తప్ప బయటి పార్టీలకు స్థానం లేదని నిరూపించారని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం టీఆర్ ఎస్ జెండా ఎగురవేసిన మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, తాను సమన్వయ పరచిన కాప్రా, మల్లాపూర్, నాచారం, రామంతా పూర్ తదితర డివిజన్ల ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఓడిపోయిన స్థానాల మీద సమీక్ష చేసుకుంటామని ఆయన తెలిపారు.