ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!

-ఇతర నగరాల్లోనూ ఐఈడీ పేలుళ్లకు ప్లాన్
-ప్రముఖ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిగే ఛాన్స్
-ఇస్లామాబాద్ మసీద్ పేలుడుకు ప్రతీకారంగా ఉగ్రవాదుల కుట్రలు

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తోందని సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ద్వారా దాడికి కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని భద్రతా బలగాలు వెల్లడించాయి.

ఉగ్రకుట్రలకు హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జైలు ములాఖత్ లో ఉగ్రకుట్ర జరిగిందన్న నిఘావర్గాలు లష్కరే తోయిబా ఉగ్రవాది జైల్లో కుట్ర చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములాఖత్ లో ఉగ్రదాడులపై చర్చించినట్లు సమాచారం. వరుస పేలుళ్ల కుట్రకేసులో ఇప్పటికే చంచల్ గూడ జైల్లో ముగ్గురు ఉగ్రవాదులున్నారు. ఈ ముగ్గురిలో ఒక ఉగ్రవాది భార్య ద్వారా ఉగ్రకుట్రపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో సైదాబాద్, ముసారాంబాగ్, మలక్ పేట్ లో పోలీసులు నిఘా ఉంచారు. అంతేకాకుండా పోలీసు యంత్రాంగం హైదరాబాద్ నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్రలింకులపై పూర్తి సమాచారం పసిగట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఢిల్లీ ఎర్రకోట వద్ద గత యేడాది నవంబర్ 10న జరిగిన కారు పేలుడులో 15 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొనడంతో కలకలం రేపింది.