ఉగాది కానుకగా మెగాస్టార్ విద్యాదానం

ఉగాది కానుకగా మెగాస్టార్ విద్యాదానం

-సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించిన చిరంజీవిఉగాది కానుకగా మెగాస్టార్ విద్యాదానంవరంగల్ టైమ్స్, హైదరాబాద్: తన కష్టంతో స్టార్ గా ఎదిగి, నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. తన 70 యేళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. సినీ రంగానికి అందించిన సేవలకు గాను పద్మభూషన్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు చిరు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ తో సత్కరించింది. అయితే తనను ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో పాతికేళ్ల క్రితమే చిరంజీవి “బ్లడ్ బ్యాంక్ “, చిరంజీవి “ఐ బ్యాంక్ ” లను స్థాపించి ఎంతో మందికి కంటి చూపును అందించి, ఎంతో మంది ప్రాణాలను కాపాడారు మెగాస్టార్. కరోనా సమయంలో ఎన్నో వ్యవప్రయాసలకోర్చి ఆక్సీజన్ సిలిండర్లు, మెడిసిన్ అందించి కరోనా పేషంట్స్ ని ఆదుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినీ పరిశ్రమ కార్మికులకు పాయం చేశారు. తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు ఎన్నోసార్లు భారీ విరాళాలు అందించారు. తాజగా ఉగాదిని పురస్కరించుకుని మరో భారీ సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రకటించి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో వేలాది మందికి అండగా నిలుస్తున్న చిరంజీవి భవిష్యత్తులో విద్యాదానంపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ తన సేవా జర్నీని గుర్తు చేసుకున్నారు. రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భంగా తనను కదిలించాయని, అందుకే 1998లో “బ్లడ్ బ్యాంక్ ” ను స్థాపించి అభిమానులను రక్తదానానికి ప్రేరేపించానని తెలిపారు. అదే టైంలో “ఐ బ్యాంక్ ” సేవలను కూడా ప్రారంభించి ఎమర్జెన్సీ టైంలో ప్రాణదాతగా నిలిచేలా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలను ప్రస్తుతం తన కుమారుడు రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారన్నారు. అయితే తన సేవలను అక్కడితో ఆపాలని ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు విద్యారంగంలో సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ప్రముఖ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ స్ఫూర్తిగా తీసుకుని, పేదలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఎక్కడైతే విద్య అవసరం ఉంటుందో అక్కడ సహాయం అందించేలా కృషి చేస్తానని చిరంజీవి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామన్నారు. మొత్తానికి సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనే ముందుండే మెగాస్టార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.