మళ్లీ విఫలమైన రైతు సంఘాల చర్చలు

మళ్లీ విఫలమైన రైతు సంఘాల చర్చలుఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జరిపిన చర్యలు ముగిశాయి. కేంద్రం రైతు సంఘాల మధ్య బుధవారం జరుగనున్న చర్చలు రద్దయ్యాయి. ఈ సమావేశంలో చట్టాలకు సంబంధించి రాతపూర్వకంగా బుధవారం ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా చెప్పినట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. అయితే కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. కేంద్ర ప్రతిపాదనలపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతిపాదనలు అందిన తర్వాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆల్ ఇండియా కిసాన్ సభ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 27 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో డిసెంబర్ 9న మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరుపుతామని కేంద్రం గతంలో ప్రకటించింది. దీనిపై బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు డిసెంబర్ 08న దేశవ్యాప్త నిరసన చేపట్టడంతో పాటు బంద్ ప్రశాంతంగా ముగియడంతో కేంద్ర హోం మంత్రి ఒకరోజు ముందుగానే రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం జరుగనున్న చర్చలు రద్దయ్యాయి.