TG EdCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG EdCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG EdCET-2026 నోటిఫికేషన్ విడుదలవరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ బీఇడి (BEd)కోర్సు ప్రవేశాల కోసం టీజీ ఈడీసెట్ 2026 (TG EdCET-2026)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, 2026న ప్రారంభమై ఏప్రిల్ 18, 2026 వరకు కొనసాగుతుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రవేశ పరీక్ష 2026-2027 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ల విద్యార్థులకు రూ.550, బీసీ, ఓసీలకు రూ.750 గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 18 వరకు, ఆలస్య రుసుము రూ.250తో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 27నుంచి రూ.500 ఆలస్య రుసుముతో,. ఏప్రిల్ 30 నుంచి రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు ఫీజు చెల్లించవచ్చన్నారు.ఆన్ లైన్ నమోదులో తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి మే 2 వరకు అవకాశం ఉంటుందన్నారు.

పరీక్ష కేంద్రాల నిర్దారణ మే 4 వరకు ఉంటుందన్నారు. చివరి నిమిషంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలనుకునే విద్యార్థులకు మే 8 నుండి మే9 లోపు రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే9న హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. మే 12న పరీక్ష నిర్వహణ ఉదయం నుండి 10నుండి 12గంటల వరకు,
రెండవ సెక్షన్ లో మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. మే 15న పరీక్ష కీ విడుదల అవుతుంది. మే 17న విద్యార్థులకు పరీక్షల కీ రిలీజ్ పై ఏదైనా సందేహాలు ఉంటే రూ.500లు ఫీజు చెల్లించి తెలుసుకోవచ్చన్నారు. 7రోజులు వర్కింగ్ సమయంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్ధులు రాసిన పరీక్షల్లో కరెక్ట్ ఉంటే 500రూపాయలు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16సెంటర్లలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని,అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని. పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుందని కేయూ వీసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఎడ్యుకేషన్ డీన్ ఆచార్య ఎన్. రామనాధ కిషన్, ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ ఎడ్ సెట్–2026 అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు