నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది: సీఎం సిద్ధరామయ్య
వరంగల్ టైమ్స్, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన ఉనికినే లేకుండా చేసేందుకు కొందరు కుట్ర ప్లాన్ చేస్తున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను కులం పేరుతో లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఒక సాధారణ గొర్రెల కాపరి ముఖ్యమంత్రి అయ్యాడనే కక్షతోనే తనపై ఈ దాడులు జరుగుతున్నాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తనను అంతం చేస్తే వారి మార్గం సుగమం అవుతుందని కొందరు భావిస్తున్నారని, కేవలం తననే కాకుండా తనకు మద్దతుగా నిలిచే వ్యక్తులను కూడా అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.రాజకీయ కుట్రలకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా తన చివరి శ్వాస వరకు పోరాడుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తాను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని కాదని ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటకలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చల నడుమ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష నేతలు కూడా ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రశ్నిస్తున్నారు, ఇది కన్నడ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.














