వరంగల్ లో ర్యాగింగ్ కి మరో యువతి బలి
వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : వరంగల్ లో మరో దారుణం చోటుచేసుకుంది. రాహుల్ అనే యువకుడి వేధింపులు భరించలేక రక్షిత అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కూతురు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతున్నది. స్వగ్రామంలో 10వ తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ అనే యువకుడు ఆమెను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. గతంలో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేశాడని రక్షిత కుటుంబసభ్యుల నుంచి సమాచారం. ఇదే విషయాన్ని రక్షిత తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో పోలీసులు రాహుల్ ను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు రక్షిత కుటుంబసభ్యుల ద్వారా తెలుస్తుంది.
అయినా రక్షిత స్నేహితుడు రాహుల్ లో మార్పు రాలేదు. ఇటీవల రాహుల్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయల్దేరింది. కానీ ఆమె కాలేజీకి వెళ్లలేదు. తల్లిదండ్రులకు తమ కుమార్తె కనిపించడం లేదని భూపాపల్లి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకు రక్షిత ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కూతురు తిరిగి వచ్చిందని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే విధంగా రక్షిత తండ్రి శంకర్ ఆమెను హాస్టల్ లో నుంచి తీసేసి, వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంట్లో ఉంచారు. అక్కడి నుంచే ఆమె రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది.
అయితే మిస్సింగ్ కేసుకు సంబంధించి రక్షిత సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉండగా, ఆదివారం ఆత్మహత్యగా పాల్పడింది. దీంతో రాహుల్ వేధింపులతోనే తన కుమార్తె రక్షిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రక్షిత సూసైడ్ కి కాలేజీకి సంబంధమే లేదు :యాజమాన్యం
విద్యార్థిని పబ్బోజు రక్షిత ఆత్మహత్యకు కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని , ర్యాగింగ్ ఆరోపణలు సరైంది కాదని రక్షిత చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చెబుతున్నట్లు సమాచారం. ‘పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని మా కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్ పొందిందని, అయితే రెండేళ్లు కళాశాలలో చదివిందని తెలిపారు. కానీ బ్యాక్ లాగ్ లు ఎక్కువగా ఉండటంతో మూడో సంవత్సరంలో డిటెంట్ అయిందన్నారు. దీంతో 6 నెలలుగా కాలేజీకి రావడం లేదని తెలిపినట్లు సమాచారం.కళాశాలకు రాని విద్యార్థినిని ఎవరు ర్యాగింగ్ చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్ అవుతోందని , ఇది సరైంది కాదని కాలేజీ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం.