దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు 13 యేళ్లు

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు 13 యేళ్లు

-2013 ఫిబ్రవరి 21 సా. 6.50 గంటలకు ఘటన
-18 మంది మృతి, 130 మందికి గాయాలు
-ఈ కేసులో ప్రత్యేక విచారణ చేపట్టిన ఎన్ఐఏ కోర్టు
-2016లో ఈ ఉగ్రవాదులు అందరికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు
-ఉరిశిక్షను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఉగ్రవాదులు
-ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు
-కోణార్క్ థియేటర్ వద్ద భారీగా పోలీసుల భద్రత

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు 13 యేళ్లువరంగల్ టైమ్స్, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటికి 13 యేళ్లు పూర్తి అయింది. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన రెండు జంట బాంబు పేలుళ్ల ఘటనకు 2026,ఫిబ్రవరి 21నాటికి 13 ఏళ్లు పూర్తి కావడంతో మరోసారి ఆ ఘటనకు సంబంధించిన గాయాలని నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో 18 మంది దుర్మరణం చెందగా, 130 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో చాలా మంది అవయవాలను కోల్పోయి, ఇన్నేళ్లు అయినప్పటికీ వారు అంగ వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఎన్ఐఏ కోర్టులో హాజరు పరచగా ఉరిశిక్ష విధించింది. అయితే ఈ ఘటన జరిగి 13 యేళ్లు గడిచినప్పటికీ, అప్పటి గాయాలు మాత్రం ఇంకా హైదరాబాద్ నగర వాసులను వెంటాడుతూనే ఉన్నాయి.

గత విషాదపు రోజుల్లోకి వెళ్తే.. అది 2013 ఫిబ్రవరి 21. సాయంత్రం 6.50 గంటలు. హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన దిల్‌సుఖ్‌నగర్‌ చిరు వ్యాపారులు, కస్టమర్లు, స్టూడెంట్లు, నగర ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంది. దుకాణాల్లో షాపింగ్ చేసేందుకు వచ్చిన ప్రజలు, కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్న విద్యార్థులు, సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, రోడ్డుపై ప్రయాణించే వాహనాలు, బస్సు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికులతో దిల్‌సుఖ్‌నగర్‌ సాయంత్రం రద్దీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు, ఏం జరుగుతుందో ఆలోచించే లోపు మరోసారి శబ్ధం వచ్చింది. భారీగా పేలుడు సంభవించి అక్కడ వాహనాలు, నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి చెల్లాచెదురైన మృతదేహాలు, తునాతునకలు అయిన శరీరాలు, వాటి నుంచి ఏరులై పారే రక్తంతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది.

ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడినట్లు తెలిపింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిద్దీన్ ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లకు ప్రధాన నిందితుడైన ఇండియన్ ముజాహిద్దీన్‌ కీలక నేత యాసిన్ భత్కల్ సహా మరో ఐదుగురు వ్యక్తులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్ నగర శివారు అయిన అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ఇంట్లో ఉండి వీరు బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు గుర్తించారు. రెండు పాత సైకిళ్లు, రెండు ప్రెజర్ కుక్కర్లను కొనుగోలు చేసిన ఈ ఉగ్రవాదులు రెండు అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను అందులో అమర్చారు. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు యాసిన్ భత్కల్ ప్లాన్ చేశాడు. దానికి అనుగుణంగానే దిల్‌సుఖ్‌నగర్‌లో రెండు సైకిళ్లను పెట్టి వెళ్లిన కొద్దిసేపటికే రెండు శక్తివంతమైన బాంబులు పేలడంతో విధ్వంసం చెలరేగింది. ఈ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఏఐ).. ఇండియన్ ముజాహిద్దీన్ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ క్రమంలో ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచింది.

ఈ కేసులో ప్రత్యేక విచారణ చేపట్టిన ఎన్ఐఏ కోర్టు 2016లో ఈ ఉగ్రవాదులు అందరికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో నిందితులంతా ఉరిశిక్షను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు, నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మరోవైపు 2026,ఫిబ్రవరి 21 నాటికి దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగి 13 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు పేలుడు జరిగిన కోణార్క్ థియేటర్ వద్ద భారీగా పోలీసులు భద్రతను పెంచారు.