కేంద్ర ప్రశంసలకు..థాంక్స్ చెప్పిన ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ మరోసారి అభినందించారు. బెంగుళూరులో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై దక్షిణాది రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. తెలంగాణలోని 54 లక్షల కుటుంబాలకు సురక్షితమైన నల్లా నీటిని అందిస్తున్నందుకు అభినందించారు. ఈ అభినందనలపై హైదరాబాద్ లో ఆదివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన మిషన్ భాగీరథ కార్యక్రమం కింద రాష్ట్రంలోని వంద శాతం అవసాలకు సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.అందులో భాగంగానే 23 వేల 930 గ్రామీణ అవసాలకు 54 లక్షల 5 వేల నల్లా కనెక్షన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించి తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. దీనికి తోడుగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని అన్నారు. తెలంగాణలోని వంద శాతం అవసాలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, నిర్దేశించిన 2024 కంటే ముందే లక్ష్యం చేరుకుందని పలు మార్లు కేంద్రం ప్రశంసించి దేశంలోని అన్ని రాష్ట్రాలు స్ఫూర్తి పొందాలని సూచించిదన్నారు.
కేంద్ర ప్రభుత్వం మిషన్ భాగీరథ పథకం కింద వంద శాతం ఆవాసాలకు 54 లక్షల నల్లాల ద్వారా సురక్షిత నీరు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాకుండా నిధులు కూడా మంజూరు చెయ్యాలన్నారు. నీతి అయోగ్ సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.19 వేల కోట్ల గ్రాంట్ ను మిషన్ భాగీరథ అమలు కోసం మంజూరు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.