మోడీ ద్వంద్వ వైఖరి వీడాలి : సీపీఐ 

మోడీ ద్వంద్వ వైఖరి వీడాలి : సీపీఐ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే సహించబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సింగరేణి బొగ్గు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బొగ్గని, మంచి డిమాండ్ కలిగి ఉందన్నారు. కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా కట్టబెడుతున్న క్రమంలోనే ఇప్పుడు సింగరేణిని కూడా వేలం వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆగ్రహించారు. కేంద్రం చేసే ప్రైవేటీకరణ ఆలోచనను సీపీఐ అడ్డుకుంటదని హెచ్చరించారు.మోడీ ద్వంద్వ వైఖరి వీడాలి : సీపీఐ ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనకు వచ్చినప్పుడు సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయమని చెప్పి, పార్లమెంట్లో మంత్రి ఒక ప్రశ్నకు జవాబుగా బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడి బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకు అప్పజెప్పాలని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి బొగ్గు గనులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా సింగరేణి బొగ్గు తమ హక్కుగా భావిస్తున్నారని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితిలో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో సీపీఐ ఉద్యమ బాట పడుతుందని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.